kiran kumar reddy: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టింది చంద్రబాబే!: విజయసాయిరెడ్డి
- ప్రత్యేక ప్యాకేజీని కోరింది చంద్రబాబే
- చంద్రబాబు ఇకనైనా డ్రామాలను కట్టిపెట్టాలి
- విభజన హామీలపై కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడటం దురదృష్టకరం
బీజేపీతో కలసి టీడీపీ, కాంగ్రెస్ లు రాష్ట్రానికి ద్రోహం చేశాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టింది చంద్రబాబేనని చెప్పారు. తన అధికారం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి... ఇప్పుడు విభజన హామీలపై మాట్లాడుతుండటం దురదృష్టకరమని అన్నారు. ప్రత్యేక హోదాను ఇచ్చేవారికే తాము మద్దతు ఇస్తామని చెప్పారు.
ప్రత్యేక హోదాను సాధించే విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి లేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు కోరిక మేరకే ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాద తీర్మానం కూడా చేశారని... ఆ ధన్యవాద తీర్మానాన్ని చంద్రబాబు విత్ డ్రా చేసుకున్నారా? లేదా? అని ప్రశ్నించారు. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని చంద్రబాబు కోరలేదా? అని అడిగారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఎక్కడకు పోయిందని... ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టాలని అన్నారు.