Burari: బురారీ సామూహిక మరణాల కేసులో మరో ట్విస్ట్... పెంపుడు కుక్క కూడా మృతి!
- ఒకే ఇంట్లో 11 మంది సామూహిక ఆత్మహత్య
- ఇంట్లో మిగిలిన ఏకైక ప్రాణి టామీ
- గుండెపోటుతో మృతి
దేశ రాజధాని న్యూఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ముక్తి లభిస్తుందన్న నమ్మకంతో పదకొండు మంది కుటుంబ సభ్యులు సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం కలిగించగా, ఆ ఇంట్లో మిగిలిన ఏకైక ప్రాణి, వారి పెంపుడు కుక్క 'టామీ' కూడా తాజాగా మరణించింది. యజమానుల మరణం తరువాత, దాన్ని నోయిడాలోని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించగా, అది గుండెపోటుతో మరణించింది.
తన యజమానులెవరకూ కనిపించని స్థితిలో చాలా ఆగ్రహంతో, ఎవరినీ దగ్గరకు రానివ్వకుండా ఈ శునకం చాలా ముభావంగా ఉండేదని జంతు సంరక్షణా కేంద్రం అధికారులు తెలిపారు. ఈ కుక్క నుంచి డాగ్ సైగల ద్వారా పోలీసులు సామూహిక ఆత్మహత్యలపై కొంత సమాచారాన్ని రాబట్టిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజుల పాటు తన చుట్టూ ఉన్నవారి ప్రేమాభిమానాలు పొందిన కుక్క, ఒంటరిగా, కొత్త వాతావరణంలో ఉండాల్సి రావడంతో, దిగులుతో అనారోగ్యం బారిన పడిందని ఓ అధికారి తెలిపారు. అంతకుముందే దానికి అనారోగ్య సమస్యలు ఉండి ఉండవచ్చని, దాన్ని బురారీ ఫ్యామిలీ కనుక్కోలేక పోయి ఉంటుందని అభిప్రాయపడ్డారు.