Congress: రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ బంద్ కు పిలుపునిచ్చింది: కొలనుకొండ శివాజీ

  • ఒక్కరోజు బంద్ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు
  • అన్యాయం చేస్తున్న బీజేపీని జగన్ ప్రశ్నించరే?
  • కాంగ్రెస్ పై నిందలు వేయడం సరికాదు

రేపు ఏపీలో ఒక రోజు బంద్ కు వైసీపీ పిలుపు నివ్వడంపై ఏఐసీసీ సభ్యుడు, ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ విమర్శలు చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిందని, ఒక్కరోజు బంద్ వల్ల మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోవడం తప్ప రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపై వైసీపీ అధినేత జగన్ కు చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్రంలో రైల్వేలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ రహదారులను స్తంభింపజేయాలని డిమాండ్ చేశారు.
 
‘దయచేసి రాజకీయాలను పక్కనబెట్టి ప్రత్యేక హోదా సాధించేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయపక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు, విద్యార్థులతో కలసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించేందుకు వైసీపీ కార్యాచరణ రూపొందించాలి. ఆ విధంగా ఎటువంటి చొరవలు తీసుకోకుండా తానే ప్రత్యేక హోదా చాంపియన్ అయిపోవాలన్న తలంపుతో మొక్కుబడి తంతుగా ఏకపక్షంగా వైసీపీ బంద్ కు పిలుపునివ్వడం వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు. పార్లమెంటు చట్టాన్ని అమలు చేయని మోదీ సర్కారును ఒక్క మాట అనలేని జగన్, మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా సరిగా వ్యవహరించలేదంటూ కాంగ్రెస్ పై నిందలేయడం విడ్డూరంగా ఉంది.

కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అన్న సంగతి జగన్ కు తెలియదా? ఆంధ్రప్రదేశ్ సహా దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న మోదీ సర్కారు విధానాలను, నిర్ణయాలను రాహుల్ గాంధీ ఏకి పారేశారు. వైసీపీ ఎంపీల మాదిరిగా రాజీనామాలు చేసి అస్త్ర సన్యాసం చేయలేదు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏనాడో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరతామని హామీ ఇచ్చారు. ఈ మేరకు తీర్మానం ఆమోదించడం కూడా జరిగింది. తాజాగా పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరతామని, రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేసి తీరతామని కుండబద్దలు కొట్టారు.

లోక్ సభలో సైతం ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని లేవనెత్తారు. ఇవేమీ జగన్ కు కనబడ లేదా? అసలు ఆర్టికల్-3 ప్రకారం ఏపీని విభజించవచ్చని ఉచిత సలహా ఇచ్చింది వైసీపీ కాదా? ఇడుపులపాయ కేంద్రంగా విభజనకు అనుకూలంగా తీర్మానం చేసింది ఎవరు? నాడు అందరి సమ్మతితోనే కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది. అధికారం కోల్పోవడం వల్ల విభజన చట్టం అమలు చేయలేకపోయింది.

కాంగ్రెస్ కన్నా గొప్పగా పదేళ్లు హోదా ఇస్తామని చెప్పి అన్యాయం చేస్తున్న బీజేపీని ఏమీ అనడం చేతకాక నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పై నిందలు వేసే అధికారం వైసీపీకి లేదని మనవి చేస్తున్నాం. నిజంగా వైఎస్ జగన్ కు రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే ఏకపక్షంగా కాకుండా, బీజేపీ మెడలు వంచే విధంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు ఐక్య కార్యాచరణతో ముందుకు రావాలని పిలుపునిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News