Chandrababu: నాడు కేసీఆర్ కు మంత్రి పదవొస్తే ‘తెలంగాణ’ కోసం పోరాడేవాడా?: పొన్నం ప్రభాకర్
- హామీలపై పోరాడని టీఆర్ఎస్ మాపై నిందలేస్తుందా?
- తెలంగాణ పౌరుషాన్ని టీఆర్ఎస్ తాకట్టు పెట్టింది
- టీఆర్ఎస్ శిఖండిలా వ్యవహరించింది
టీఆర్ఎస్ పైన, సీఎం కేసీఆర్ పైనా టీ-కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. లోక్ సభలో ఇటీవల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో టీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషించిందని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ప్రతిపాదనను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సమక్షంలో టీఆర్ఎస్ అంగీకరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీ-కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని అన్నారు. విభజన హామీలపై టీఆర్ఎస్ పోరాడకుండా తమ పార్టీని నిందించడం తగదని అన్నారు. తెలంగాణ పౌరుషాన్ని తాకట్టు పెట్టి టీఆర్ఎస్, కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణ కోసం పోరాటం చేశామని టీఆర్ఎస్ నేతలు చెప్పడం కరెక్టు కాదని, చరిత్ర మరచి వాళ్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
చంద్రబాబునాయుడు హయాంలో కేసీఆర్ కు మంత్రి పదవొస్తే తెలంగాణ కోసం ఆయన పోరాడేవాడా? అని పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువతను హరీశ్ రావు రెచ్చగొట్టారని, వారు ఆత్మహత్యలు చేసుకునేలా పురిగొల్పారని ఆరోపించారు.