Karnataka: శిరూరు మఠాధిపతి మృతి కేసు.. ఆసక్తికర అంశాలు వెలుగులోకి!
- శిరూరు మఠాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు
- ఓ శక్తివర్థక పానీయం తాగే అలవాటున్న స్వామీజీ
- ఓ మహిళతో స్వామీజీకి పరిచయం.. విచారణలో వెల్లడి
కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి అష్టమఠాలలో ఒకటైన శిరూరు మఠాధిపతి లక్ష్మీవర తీర్థ స్వామీజీ గత బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి ఫుడ్ పాయిజన్ కావడమే కారణమనే ఆరోపణలు వినిపించాయి. ఈ కేసు విచారణ నిమిత్తం శిరూరు మఠాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా విచారణలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. లక్ష్మీవర తీర్థస్వామి తరచుగా ఓ శక్తివర్థక పానీయాన్ని మఠానికి తెప్పించుకుని తాగేవారట. ‘మోరిన్జి’ పేరుతో పిలిచే ఈ పానీయం సీసాను పోలీసులు గుర్తించారు. తీర్థస్వామి తీసుకున్న ఆహారంలో విషపదార్థాలు ఉన్నట్లు ప్రాథమిక మరణ నివేదికలో వైద్యులు వెల్లడించారు.
ఈ కేసుకు సంబంధించి మరో ఆసక్తికర విషయం స్థానికుల ద్వారా, మఠం మాజీ మేనేజర్ సునీల్ ద్వారా తెలుస్తోంది. ఉడుపిలోని మెయిన్ రోడ్డు బ్రహ్మావర ప్రాంతంలో నివసించే ఓ మహిళ ఈ మఠానికి వస్తుండేవారు. ఓ ఆటోడ్రైవర్ ద్వారా తీర్థవరస్వామికి ఆ మహిళ పరిచయమైందట. మొదట్లో వారానికోసారి మాత్రమే మఠానికి వెళ్లేదని, ఆ తర్వాత రెండు రోజులకోసారి అక్కడికి వెళ్తుండేదని తెలుస్తోంది.
ఒక్కోసారి రోజంతా ఆ మఠంలోనే ఆమె గడిపేదని స్థానికుల సమాచారం. మొదట్లో కాలినడకన ఆ మహిళ మఠానికి వచ్చి వెళ్తుండేదని, ఆ తర్వాత ఆటోలో, కారులో మఠానికి వెళ్లే స్థాయికి ఆమె ఎదిగిందని మాజీ మేనేజర్ సునీల్ చెప్పారు. మఠం పాలన వ్యవహారాల్లో కూడా ఒక్కోసారి ఆమె జోక్యం చేసుకుంటూ ఉండేదని, తీర్థవర స్వామి ధరించిన ఆభరణాలనే ఆమె కూడా ధరించేదని ఆరోపించారు. అయితే, తీర్థవర స్వామి అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆ మహిళ కనిపించకుండాపోయింది.
కాగా, ఈ కథనాల నేపథ్యంలో ఉడుపి ఎస్పీ లక్ష్మణ్ నింబర్గి స్పందిస్తూ, ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఓ మహిళను విచారిస్తున్న మాట నిజమేనని చెప్పారు. ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, పోస్టుమార్టం నివేదికలు వచ్చిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు.