Jinzhou Medical University: వృద్ధుడికి నోటి ద్వారా శ్వాస అందించి.. ప్రాణాలు కాపాడిన యువతి!
- చైనాలోని జింఝౌలో ఘటన
- రైల్వే స్టేషన్ లో స్పృహతప్పి పడిపోయిన వృద్ధుడు
- సీపీఆర్ ప్రక్రియ ద్వారా ప్రాణాలు నిలబెట్టిన యువతి
సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ వృద్ధుడి ప్రాణాలను కాపాడిందో యువతి. చైనాలోని జింఝౌలో ఈ ఘటన జరగగా... సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే, స్థానిక రైల్వే స్టేషన్ లో 81 ఏళ్ల వృద్ధుడు స్పృహతప్పి పడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ యువతి వెంటనే స్పందించి.. సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసస్సీటేషన్) ప్రక్రియ ద్వారా ఆయనకు ప్రాణం పోసింది.
మోకాళ్లపై కూర్చొని, రెండు చేతులతో అతని ఛాతీపై పదేపదే బలంగా నొక్కింది. మరోవైపు నోటి ద్వారా అతనికి శ్వాసను అందించింది. కాసేపటికి ఆయన గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. దాంతో ఆయనను లేపి కూర్చోబెట్టారు. ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించిన ఆ యువతిని జింఝౌ మెడికల్ కాలేజీ విద్యార్థిని డింగ్ హుయ్ గా గుర్తించారు. ఆమె చేసిన గొప్ప పనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.