cow: ఆవుల్ని చంపడం ఆపితేనే మూకదాడులు ఆగుతాయి!: ఆరెస్సెస్ సీనియర్ నేత ఇంద్రేష్ కుమార్
- సంస్కారంతోనే హింస, అల్లర్లకు చెక్
- ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ వెల్లడి
- ఇతరుల మనోభావాల్ని దెబ్బతీసే హక్కు ఎవ్వరికీ లేదు
దేశంలో ఆవుల్ని చంపడం ఆపేస్తే మూకదాడులు వాటంతట అవే ఆగిపోతాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సీనియర్ నేత ఇంద్రేష్ కుమార్ అన్నారు. ఏ మతం కూడా ఆవుల్ని చంపడాన్ని అనుమతించబోదని ఆయన స్పష్టం చేశారు. జార్ఖండ్ లోని రాంచీలో సోమవారం హిందూ జాగరణ్ మంచ్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా, రాజస్తాన్ లోని ఆళ్వార్ లో అక్బర్ అనే ముస్లిం యువకుడ్ని కొందరు దుండగులు కొట్టిచంపడంపై ఆయన స్పందిస్తూ.. ’గోవుల్ని చంపమని చెప్పే ఒక్క మతాన్ని నాకు చూపించండి. ఏసుక్రీస్తు పశువుల పాకలో పుట్టిన కారణంగా క్రైస్తవులు సైతం ఆవును గోమాతగా కీర్తిస్తారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మక్కా, మదీనాల్లో గోవుల్ని చంపటాన్ని పాపంగా పరిగణించి నిషేధించారు. ఈ పాపం నుంచి ఈ ప్రపంచాన్ని, మానవకోటిని విముక్తం చేయడానికి మనం కంకణబద్ధులం కాలేమా? గోహత్యలు ఆగిపోతే మూకదాడులు వాటంతట అవే తగ్గిపోతాయి‘ అని పేర్కొన్నారు.
సంస్కారంతోనే హింసకు అడ్డుకట్ట..
సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ పై ఇటీవల జార్ఖండ్ లో కొందరు వ్యక్తులు దాడి చేయడాన్ని కుమార్ ఖండించారు. "ఇది చాలా తప్పు, ఖండించతగినది. అయితే, భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి, ఇతరుల మనోభావాలను దెబ్బతీసే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు" అంటూ చురక అంటించారు. మూక దాడులు, అల్లర్లను నివారించేందుకు ప్రభుత్వం చట్టాలు చేసినప్పటికీ, వీటిని అరికట్టేందుకు ప్రజల్లో మంచి సంస్కారం, విలువల్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.