MS Dhoni: భారీ మొత్తంలో ఆదాయపు పన్ను కట్టిన ధోనీ!
- 2017-18లో రూ.12.17 కోట్ల పన్ను చెల్లించిన మహి
- గతేడాది కంటే 1.24 కోట్లు అధికం
- వివరాలు వెల్లడించిన ఐటీ శాఖ అధికారులు
టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని జార్ఖండ్ లో అత్యధికంగా ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా నిలిచినట్లు ఐటీ అధికారులు తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ధోని రూ.12.17 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఇది గతేడాదితో పోల్చుకుంటే రూ.1.24 కోట్లు ఎక్కువని పేర్కొన్నారు. గతేడాది ధోని రూ.10.93 కోట్లను చెల్లించి జార్ఖండ్-బిహార్ ప్రాంతంలో ఎక్కువ పన్నును చెల్లించిన వ్యక్తిగా నిలిచారన్నారు.
ఫోర్బ్స్ జాబితాలో 8వ స్థానం..
ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రకారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆదాయాన్ని ఆర్జిస్తున్న భారత క్రికెటర్ గా ధోని రికార్డు నెలకొల్పారు. 2017లో రూ.63.7 కోట్ల వార్షికాదాయంతెో భారీ మొత్తాన్ని అందుకుంటున్న భారతీయుల్లో 8వ స్థానంలో నిలిచారు. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీల్)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ధోని విజయతీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే.
ఇక హకీ ఇండియా లీగ్ లో రాంచీ రేస్ జట్టుకు, ఇండియా సూపర్ లీగ్ లో చెన్నయిన్ ఎఫ్సీకి ధోని సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. 2017లో ’సెవన్‘ పేరిట ధోని వస్ర్త దుకాణాలను సైతం ప్రారంభించారు. ఇటీవల ఇంగ్లండ్ తెో ముగిసిన 3 వన్డేల సిరీస్ చివరి మ్యాచ్ చివరిలో ధోని బంతిని తీసుకోవడంతో అతను వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే టీమిండియా యాజమాన్యం వీటిని ఖండించింది.