talasani srinivas yadav: ఏపీ ప్రజలను అమాయకులను చేసి ఆడుకుంటున్నారు!: తలసాని శ్రీనివాస్ యాదవ్
- ప్రాంతీయ పార్టీలను తొక్కాలనేదే రెండు పార్టీల విధానం
- అందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ను తెరపైకి తెచ్చారు
- ఏపీలో రాజకీయాలు భ్రష్టుపట్టి పోయాయి
కాంగ్రెస్, బీజేపీలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. రెండు పార్టీలు దొందూదొందేనని చెప్పారు. ప్రాంతీయ పార్టీలను తొక్కాలనేదే ఆ రెండు పార్టీల విధానమని... దేశాభివృద్ధిని ఆ పార్టీలు పట్టించుకోవని మండిపడ్డారు. ఈ కారణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. ప్రజలు ఆశించిన స్థాయిలో మోదీ ప్రభుత్వం పని చేయడం లేదని విమర్శించారు.
దేశానికి మోదీ చేసిందేమీ లేదని... ఆయన తన తీరును మార్చుకోవాలని తలసాని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఒకసారి అంటారని, వద్దని మరోసారి అంటారని, ఏపీ ప్రజలను అమాయకులను చేసి ఆడుకుంటున్నారని చెప్పారు. ఏపీలో రాజకీయాలు భ్రష్టుపట్టి పోయాయని అన్నారు. చార్మినార్ ను కూడా తానే కట్టానని చంద్రబాబు అంటారని చెప్పారు. అవిశ్వాసం సందర్భంగా లోక్ సభలో రాహుల్ గాంధీ వ్యవహార శైలి పిల్లచేష్టలా ఉందని ఎద్దేవా చేశారు.