Prakash Raj: ఆ లేఖపై నేను సంతకం చేశానన్న వార్తలు అవాస్తవం!: ప్రకాశ్ రాజ్
- నటుడు దిలీప్ కు ‘అమ్మ’లో తిరిగి సభ్యత్వంపై రభస
- కేరళ సర్కార్ కు లేఖ రాసిన దర్శకుడు బిజూకుమార్
- ఆ లేఖకు ప్రకాశ్ రాజ్ మద్దతు తెలిపినట్టు వార్తలు
- ఈ వార్తలను ఖండించిన ప్రకాశ్ రాజ్
ఒక నటి విషయంలో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలైన నటుడు దిలీప్ కు మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ (అమ్మ)లో తిరిగి సభ్యత్వం కల్పించిన సంగతి విదితమే. ఈ విషయమై ‘అమ్మ’ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు మోహన్ లాల్ కు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దిలీప్ కు తిరిగి సభ్యత్వం కల్పించే విషయంలో మోహన్ లాల్ తమను సంప్రదించలేదని అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, కేరళ ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మోహన్ లాల్ ను ఆహ్వానించవద్దంటూ జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు బిజూకుమార్ దామోదరన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ఈ లేఖకు వందకు పైగా నటులు తమ మద్దతు తెలిపారని, వారిలో నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నట్టు చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. మోహన్ లాల్ ను వ్యతిరేకిస్తూ తాను ఎటువంటి మద్దతు తెలుపలేదని, సంతకాలు చేయలేదని స్పష్టం చేశారు. నటుడు దిలీప్ విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంపై తనకు విభేదాలు ఉన్నాయి కానీ, మోహన్ లాల్ కు వ్యతిరేకంగా రాసిన లేఖపై మాత్రం తాను సంతకం చేయలేదని, ఆ వార్తలన్నీ అవాస్తవమని చెప్పారు.