Car: ఆ కారు ధర ఒకటి కాదు..రెండు కాదు...అక్షరాలా రూ. 121 కోట్లు
- ఇటలీ కార్ల సంస్థ పగానీ ఆటోమొబైల్స్ ఉత్పత్తి
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు
- పేరు జోండా హెచ్ పీ. బార్షెటా
మామూలుగా కారు ధరలు ఎలా ఉంటాయి? నాలుగైదు లక్షలు మొదలుకుని కోటి రూపాయల ధర దాకా పలుకుతుంటాయి. లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ కార్లు ధరలు మాత్రం రూ. 20, 30 కోట్లు ఉంటాయి. అసలు కోటిరూపాయల కారునే సామాన్యులు ఆశ్చర్యంగా చూస్తుంటారు. రూ.20, 30 కోట్ల రేటు పలికే కార్ల గురించి అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఈ కారు ధర చూస్తే ఇక ఎవరికీ నోటమాటరాదేమో!
ఇటలీకి చెందిన ప్రముఖ స్పోర్ట్స్ కార్ల ఉత్పత్తుల సంస్థ పగానీ ఆటోమొబైల్స్ తయారుచేసిన ఓ కారు ధర అక్షరాలా రూ. 121కోట్లు. ఈ కారు పేరు జోండా హెచ్ పీ బార్షెటా. ఇటీవల జరిగిన గుడ్ వుడ్ ఫెస్టివల్ లో ఈ కారును ఆవిష్కరించారు. ఈ మోడల్ లో కేవలం మూడు కార్లే తయారు చేయగా, అవి వెంటనే అమ్ముడుపోయాయి. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన కారుగా జోండా హెచ్ పీ బార్షెటా రికార్డులకెక్కింది. పగానీ ఆటోమొబైల్స్ ఇప్పటికే తయారుచేసిన జోండా 760 సిరీస్, హుయైరా బీసీ మోడళ్ల హైబ్రిడ్ రకమే జోండా హెచ్ పీ బార్షెటా. 1250 కేజీల బరువుగల ఈ కారులో ఏఎంజీ వీ12 ఇంజిన్ ఉంటుంది. 789 హార్స్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.