Mayawathi: కోరినన్ని సీట్లు ఇస్తేనే కాంగ్రెస్ తో పొత్తు: మాయావతి మెలిక
- మూడు రాష్ట్రాల ఎన్నికల్లో పొత్తుపై బీఎస్పీ ట్విస్ట్
- కాంగ్రెస్ తగినన్ని సీట్లు కేటాయించాలి
- లేకపోతే పునరాలోచించాల్సి వస్తుందన్న మాయావతి
వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రాంతీయ పార్టీలతో కలిసి పోరాడాలని కాంగ్రెస్ భావిస్తోంటే.. ఆ పార్టీకి అడుగడుగునా అడ్డంకులు తగులుతున్నాయి. ముఖ్యంగా మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లుతోంది. లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిష్టాత్మకంగా భావించిన మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ బీఎస్పీతో పొత్తుకు ప్రయత్నిస్తోంటే... ఆ పార్టీ మాత్రం షరతులు విధిస్తోంది.
మూడు రాష్ట్రాల్లో బీఎస్పీకి తగినన్ని సీట్లు కేటాయిస్తేనే కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుంటామని మాయావతి స్పష్టం చేశారు. కాంగ్రెస్ తమ డిమాండ్ కు తలొగ్గకపోతే పొత్తుపై పునరాలోచిస్తామని హెచ్చరించారు. దీంతో బీఎస్పీ, కాంగ్రెస్ పొత్తు వ్యవహారం సందిగ్ధంలో పడినట్టయింది. నిజానికి జాతీయస్థాయిలోనూ కాంగ్రెస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు కనిపించడం లేదు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతే ప్రధానమంత్రి అభ్యర్ధని, విదేశీయురాలైన సోనియాగాంధీ పోలికలు ఎక్కువగా ఉన్న రాహుల్ ప్రధాని పదవికి సరిపోరని బీఎస్పీ నేత జై ప్రకాశ్ కొన్ని రోజుల క్రితం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాయావతి ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని అందరూ భావిస్తుండగా...మాయావతి తాజాగా కొత్త ట్విస్ట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.