Rajasthan: పరిహారం కాదు.. న్యాయం కావాలి!: మూకదాడిలో మరణించిన అక్బర్ కుటుంబీకుల డిమాండ్
- దోషుల్ని కఠినంగా శిక్షించండి
- రాజస్తాన్ హోంమంత్రికి అక్బర్ కుటుంబీకుల విజ్ఞప్తి
- రూ. 1.25 లక్షల పరిహారం ప్రకటించిన మంత్రి కటారియా
అక్బర్ అలియాస్ రక్బర్ ఖాన్ ను హత్యచేసిన దుండగుల్ని కఠినంగా శిక్షించాలని అతని కుటుంబ సభ్యులు రాజస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి తాము ఎలాంటి ఆర్థిక సాయాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. రాజస్తాన్ లోని ఆల్వార్ లో కొందరు దుండగులు జూలై 20న అక్బర్ ను గోవుల స్మగ్లర్ గా అనుమానించి కొట్టిచంపిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యంపైనా పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో రాజస్తాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా మంళవారం బాధిత కుటుంబాన్ని కలుసుకున్నారు. అనంతరం అక్బర్ కుటుంబానికి రూ. 1.25 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
మంత్రితో భేటీ అనంతరం అక్బర్ తండ్రి సులైమాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మాకు కేవలం న్యాయం మాత్రమే కావాలి. నా కుమారుడ్ని చంపినవాళ్లను కఠినంగా శిక్షించాలి’ అని కోరారు. మరోవైపు మంత్రి కటారియాను కలుసుకున్న కిసాన్ సభ ప్రతినిధులు.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల నష్ట పరిహారంతో పాటు అక్బర్ భార్యకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.