Tamilnadu: తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంకు తాజా తలనొప్పి
- అక్రమాస్తుల కేసులో దర్యాప్తు ప్రారంభం
- కోర్టుకు తెలిపిన డీవీఏసీ
- సీబీఐ దర్యాప్తు కోరిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు
అన్నాడీఎంకే నేత, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు కొత్త తలనొప్పి మొదలైంది. పన్నీర్ సెల్వం, ఆయన కుటుంబ సభ్యుల అక్రమాస్తుల కేసు విషయంలో ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డీవీఏసీ) బుధవారం మద్రాస్ హైకోర్టుకు తెలిపింది.
డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఆర్ఎస్ భారతి, ఎన్జీవో అరప్పోర్ ఇయ్యకమ్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ పన్నీర్ సెల్వం అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. ఇది జరిగి మూడు నెలలు అయినా ఇప్పటి వరకు స్పందన లేకపోవడంతో డీవీఏసీని కోర్టు మందలించింది. దీంతో బుధవారం జస్టిస్ జి.జయచంద్రన్ ఎదుట హాజరైన అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ మాట్లాడుతూ..దర్యాప్తుకు సంబంధించిన ఆదేశాలు 18న వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నట్టు తెలిపారు. దీంతో పిటిషన్‌ను మూసివేసిన కోర్టు.. దర్యాప్తులో ఏదైనా తప్పు జరిగితే తిరిగి కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కు తెలిపింది.
పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మి ఆస్తులు 2011లో రూ.24.20 కోట్లు ఉండగా, 2016కు రూ.78 కోట్లు అయ్యాయని, ఈ ఏడాది మార్చిలో భారతి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎటువంటి ఆదాయ వనరు లేని ఓ గృహిణికి అంత ఆదాయం ఎలా వచ్చిందో సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరారు.