Pakisthan: ఒక్క సీటునూ దక్కించుకోలేక పోయిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్!
- హఫీజ్ ను తిరస్కరించిన పాక్ ప్రజలు
- ఖాతా ఓపెన్ చేయని అల్లాహో అక్బర్ తెహరీక్
- స్వతంత్రులుగా బరిలోకి దిగిన హఫీజ్ అనుచరుల్లో కొందరి విజయం
పాకిస్థాన్ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హఫీజ్ సయీద్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో ఆయన్ను ప్రజలు ఘోరంగా తిరస్కరించారు. ఆయన మద్దతిచ్చిన అల్లాహో అక్బర్ తెహరీక్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. అయితే, ఆయన మద్దతుదారులమని చెప్పుకుంటూ బరిలోకి దిగిన ఇండిపెండెంట్ అభ్యర్థులు కొందరు విజయం సాధించారు. మొత్తం 272 స్థానాలకుగాను ఎన్నికలు జరుగగా, ప్రభుత్వ ఏర్పాటులో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహరీక్ ఇన్సాఫ్ పార్టీ 121 స్థానాల్లో ముందంజలో ఉంది. 58 స్థానాలతో రెండో స్థానంలో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ కొనసాగుతుండగా, 35 స్థానాలతో మూడో స్థానంలో బిలావల్ బుట్టో నేతృత్వంలోని పీపీపీ కొనసాగుతోంది. ఇప్పటివరకూ సుమారు 55 శాతం కౌంటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది.
మ్యాజిక్ ఫిగర్ కు ఏ పార్టీ చేరుకోని పరిస్థితి ఏర్పడటంతో పీపీపీ మద్దతు కోరాలని ఇమ్రాన్ ఖాన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని పీఎంఎ-ల్ఎన్ నేతలు ఆరోపించగా, సీఈసీ సర్దార్ ముహమ్మద్ రజా కొట్టిపారేశారు. కొన్ని సాంకేతిక ఇబ్బందులు మినహా, ఈ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా జరిపించామని కొద్దిసేపటి క్రితం ఆయన తెలిపారు.