Facebook: ఆత్మహత్య చేసుకోబోయిన బాలికను కాపాడిన ఫేస్ బుక్!
- ఆత్మహత్య చేసుకోబోతున్నానని పోస్ట్ చేసిన బాలిక
- వెంటనే పోలీసుల్ని అప్రమత్తం చేసిన ఫేస్ బుక్ అధికారులు
- 30 నిమిషాల్లోనే బాలిక ఆచూకీ గుర్తింపు, కౌన్సెలింగ్
సోషల్ మీడియా యువతను చెడగొడుతోందని మనం చాలాసార్లు వింటుంటాం. అయితే ఆ సోషల్ మీడియా కారణంగానే ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ బాలికను పోలీసులు కాపాడగలిగారు. వివరాల్లోకెళితే.. అస్సాంకు చెందిన ఓ బాలిక ‘నేను ఆత్మహత్య చేసుకోబోతున్నా’ అంటూ బుధవారం రాత్రి తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అమెరికాలోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయంలో ఈ కామెంట్ ను గమనించిన అధికారులు వెంటనే అస్సాం పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు 30 నిమిషాల్లోనే బాలిక ఇంటికి చేరుకుని ఆమెను రక్షించగలిగారు. అనంతరం బాలిక, ఆమె తల్లిదండ్రుల్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించిన అధికారులు.. కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ విషయమై అస్సాం అదనపు డీజీపీ హర్మీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. బాలిక ఆత్మహత్య చేసుకుంటానని కామెంట్ పోస్ట్ చేయగానే ఫేస్ బుక్ తమ ’సోషల్ మీడియా సెంటర్‘ కు వెంటనే సమాచారం అందించిందన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాలిక ఆచూకీని కనిపెట్టారన్నారు. నకిలీ వార్తలు, వదంతుల నియంత్రణకు అస్సాం పోలీసులు ఇటీవల ప్రారంభించిన సోషల్ మీడియా సెంటర్ ద్వారానే బాలికను కాపాడగలిగామన్నారు. కౌన్సెలింగ్ అనంతరం పోలీసుల సలహాతో బాలిక తన ఫేస్ బుక్ లో పెట్టిన ఆత్మహత్య పోస్ట్ ను తొలగించిందన్నారు.