Andhra Pradesh: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, వంతెన నిర్మాణాల్లో సాంకేతికతకు పెద్దపీట: ఏపీ సీఎస్
- రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాల్లో అలక్ష్యం చూపొద్దు
- త్వరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలి
- అన్ని పనులు 2020 మార్చికి పూర్తి చేయాలి
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే రోడ్లు, వంతెనల నిర్మాణాల్లో సాంకేతికతకు పెద్దపీట వేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన రోడ్ల నిర్మాణాల ప్రగతిని రాష్ట్ర హోం శాఖ సలహాదారు దుర్గా ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 119 రోడ్లు, 9 బ్రిడ్జి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని, వాటిలో 7 రోడ్ల పనులు ప్రారంభమయ్యాయని, 64 రోడ్ల పనులు టెండర్ల దశలో ఉన్నట్టు సీఎస్ కు వివరించారు. మిగిలిన 48 రోడ్ల నిర్మాణాలకు అటవీ, ఆర్ అండ్ బి శాఖ అనుమతులు రావాల్సి ఉందని, మైదాన ప్రాంతాలతో పాటు ఎత్తయిన ప్రాంతాల్లో వివిధ పద్ధతిలో చేపట్టే రోడ్ల నిర్మాణాలను, సీలేరులో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనుల ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, నవంబర్ లోగా సీలేరులో నిర్మించిన వంతెన పనులు పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. రోడ్లు, వంతెనల నిర్మాణాల్లో సాంకేతికతకు పెద్దపీట వేయాలని, దీనివల్ల పనులు సకాలంలో పూర్తి చేసే అవకాశం కలుగుతుందని చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాల్లో అలక్ష్యం చూపొద్దని, త్వరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని, అటవీ, ఆర్ అండ్ బి శాఖల నుంచి అనుమతుల కోసం సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలని ఆదేశించారు. అన్ని రోడ్లు, బ్రిడ్జి పనులను 2020 మార్చి నాటికి పూర్తి చేయాలని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖాధికారులకు దినేష్ కుమార్ దిశానిర్దేశం చేశారు.