Pakistan: అబ్బే.. ఇకపై 'వన్ సైడ్' కుదరదు.. అమెరికాకు తేల్చి చెప్పేసిన ఇమ్రాన్ ఖాన్!
- సంబంధాల వల్ల ఇరువైపులా లబ్ధి జరగాలి
- సమతూకం ఉంటేనే వాటికి విలువ
- నా గెలుపుతో ప్రజాస్వామ్యం బలపడింది
పాక్ ప్రధాని కాబోతున్న ఇమ్రాన్ ఖాన్ తొలి ప్రసంగంలోనే వివిధ దేశాలతో సంబంధాలపై తన విధానాన్ని స్పష్టం చేశారు. తన పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్నికైన అనంతరం గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికాతో సంబంధాల విషయంలో చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలిపారు. ఇకపై ఒకవైపు నుంచే సంబంధాలు కుదరవని, రెండువైపులా అవి సమతూకంగా ఉండాలని తేల్చి చెప్పారు. వాటి వల్ల ఇరు దేశాలు సమాన లబ్ధి పొందితేనే వాటికి విలువ ఉంటుందన్నారు.
‘‘సంబంధాల విషయంలో సమతూకం పాటించాల్సిన అవసరం ఉంది’’ అని కుండ బద్దలుగొట్టారు. విదేశాంగ విధానమే అత్యంత క్లిష్టమైనదని పేర్కొన్న ఇమ్రాన్ భారత్‌తో సంబంధాల విషయంలోనూ తన వైఖరిని తేల్చి చెప్పారు. భారత్‌తో సంబంధాల పునరుద్ధరణనే కోరుకుంటున్నానని, ఆ దేశం ఒక అడుగు ముందుకేస్తే తాను రెండడుగులు ముందుకు వేస్తానని స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతమైందనడానికి తమ గెలుపే ఉదాహరణ అన్నారు. ఉగ్రదాడులు జరిగినప్పటికీ ఎన్నికలు విజయవంతంగా జరిగాయని పేర్కొన్న ఇమ్రాన్, భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలిపారు.