Guntur District: పల్నాడులో 'సజీవ సమాధి' కలకలం!
- గత పదేళ్లుగా ఆధ్యాత్మిక భావనలతో ఉన్న లచ్చిరెడ్డి
- దేవుడు చెప్పాడంటూ సమాధి నిర్మాణం
- ప్రవేశానికి అనుమతించాలని పోలీసులకు వినతి
గడచిన పదేళ్లుగా ఆధ్యాత్మిక భావనలతో కుటుంబానికి దూరంగా ఉంటున్న ఓ వృద్ధుడు సజీవంగా సమాధి చెందాలన్న తలంపుతో, తనంతట తానుగా గొయ్యి తీయించుకుని ఏర్పాట్లు చేసుకోగా, పోలీసులు అడ్డుకున్న ఘటన పల్నాడు ప్రాంతంలో జరిగింది. మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన తాతిరెడ్డి లచ్చిరెడ్డి (70) తనను దేవుడు సజీవ సమాధి కావాలని ఆజ్ఞాపించాడని చెబుతూ, పది అడుగుల లోతైన గుంతను నిర్మించి, దానిలోపలికి దిగేందుకు మెట్లు కట్టించుకుని, ఇనుప తలుపులు ఏర్పాటు చేశాడు.
ఇక తనకు సమాధిలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులకు లేఖలు రాశాడు. దీంతో లచ్చిరెడ్డి సమాధి ప్రవేశాన్ని అడ్డుకోవాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు అందాయి. మాచర్ల పోలీసులు గన్నవరం చేరుకుని లచ్చిరెడ్డిని అదుపులోకి తీసుకుని, ఇటువంటి పనులు చట్ట వ్యతిరేకమని నచ్చజెప్పి, ఆయన ప్రయత్నాన్ని విరమించుకునేలా చేశారు.