China: వడగళ్ల వానతో చైనా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!
- గాల్లో తీవ్రంగా దెబ్బతిన్న విమానం ముందు భాగం
- చాకచక్యంగా వుహాన్ విమానాశ్రయంలో ల్యాండింగ్
- పైలెట్లతో పాటు ప్రయాణికులందరూ సురక్షితం
సాధారణంగా సాంకేతిక సమస్యలతోనో, పక్షులు ఢీకొడితేనో విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేస్తుంటారు. అయితే చైనాలో మాత్రం వడగళ్ల వాన తీవ్రతకు విమానం ముందుభాగం తీవ్రంగా దెబ్బతినడంతో పైలెట్లు అత్యవసరంగా మార్గమధ్యంలోనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
చైనాకు చెందిన టియాన్జిన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఏ320 విమానం టియాన్జిన్ నుంచి హైకౌకు బయలుదేరింది. విమానం గాల్లో 32,000 అడుగుల ఎత్తులో ఉండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇంతలోనే భారీగా వడగళ్ల వాన కురవడంతో విమానం ముందుభాగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో విమానంలోని రాడార్ పనిచేయడం ఆగిపోయింది. విమానం కాక్ పీట్ అద్దానికి పగుళ్లు కూడా ఏర్పడటంతో ముందు ఏముందో స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది.
ధైర్యం చేసిన పైలెట్లు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించారు. చివరికి వుహాన్ లోని విమానాశ్రయంలో అత్యంత చాకచక్యంగా విమానాన్ని పైలెట్లు దించగలిగారు. ఈ ఘటనలో పైలెట్లతో పాటు ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.