imrankhan: ఇమ్రాన్ ఖాన్ విజయం దేశ రాజకీయాలపై చెడు ప్రభావం చూపుతుంది: నవాజ్ షరీఫ్
- జైల్లో శిక్ష అనుభవిస్తున్న షరీఫ్ ను కలిసిన పార్టీ నేతలు
- ఎన్నికల ఫలితాలపై ఆరా తీసిన షరీఫ్
- ఈ ఎన్నికల ఫలితాలు దేశానికే కళంకమని విమర్శ
పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ గెలుపు దేశ రాజకీయాలపై చెడు ప్రభావం చూపుతుందని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ విమర్శించారు. ఆడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న నవాజ్ షరీఫ్ ను ప్రతి గురువారం పార్టీ నేతలు కలుసుకునే అవకాశముంది. ఈ క్రమంలో నిన్న పీఎంఎల్ఎన్ నేతలు అక్కడికి వెళ్లి షరీఫ్ ను కలిశారు. పాక్ ఎన్నికల ఫలితాల గురించి తమ నేతలను అడిగి తెలుసుకున్నారు.
తమ పార్టీ నేతలకు మంచి పట్టు ఉన్న ఫైసలాబాద్, లాహోర్, రావల్పిండి ప్రాంతాల్లో వారు ఓటమిపాలు కావడం, ఇమ్రాన్ ఖాన్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంపై నవాజ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఇమ్రాన్ పార్టీ ఇప్పుడిలా నెగ్గడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు దేశానికే కళంకమని అన్నారు.
కాగా, అవినీతి కేసులో దోషులుగా తేలిన నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియంకు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. షరీఫ్ ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ఆయన ఫిజీషియన్ కూడా నిన్న అక్కడికి వెళ్లారు.