Madhya Pradesh: ఆహ్వానం అందకపోవడంపై సింధియా ఆగ్రహం.. కేంద్రమంత్రి క్షమాపణలు!
- మధ్యప్రదేశ్ సీఎంపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతానని ప్రకటన
- అందరి తరఫున క్షమాపణలు కోరిన కేంద్ర మంత్రి గడ్కరీ
- భవిష్యత్ లో జాగ్రత్తలు తీసుకుంటామని హామీ
సొంత నియోజకవర్గంలో రహదారి ప్రారంభోత్సవానికి తనను మధ్యప్రదేశ్ ప్రభుత్వం పిలవకపోవడంపై కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం తనను ఆహ్వనించకుండా నిబంధనల్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని మండిపడ్డారు. ప్రారంభోత్సవ శిలాఫలకంపై కనీసం తను పేరు కూడా లేదన్నారు. ఈ ఘటనకు నిరసనగా లోక్ సభలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతానని ప్రకటించారు.
దీంతో వెంటనే స్పందించిన కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ.. సింధియాను పిలవకపోవడం ముమ్మాటికీ తప్పేనని అంగీకరించారు. ఈ కార్యక్రమానికి తాను హాజరైనందున, అందరి తరఫున సింధియాను క్షమాపణ కోరుతున్నట్లు ప్రకటించారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని సింధియా డిమాండ్ చేయగా, యూపీఏ హయాంలో చాలా మంది బీజేపీ ఎంపీలకు కూడా ఆహ్వానాలు అందలేదని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కౌంటర్ ఇచ్చారు.