Andhra Pradesh: ఏపీ శాశ్వత అసెంబ్లీ ఐదు అంతస్తుల్లో నిర్మిస్తాం: స్పీకర్ కోడెల
- భవన ఆకృతులపై సూచనలు చేశా
- అసెంబ్లీ నిర్మాణం విధులకు అనుకూలంగా ఉండాలి
- నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో కోడెల
ఏపీ అసెంబ్లీ శాశ్వత భవనాన్ని ఐదు అంతస్తులలో నిర్మించనున్నట్టు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. శాశ్వత చట్టసభల నిర్మాణాల ఆకృతులపై నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో తాత్కాలిక అసెంబ్లీలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. అనంతరం, కోడెల మీడియాతో మాట్లాడుతూ, భవన ఆకృతులలో చిన్నచిన్న మార్పులు చేర్పులు సూచించానని, అసెంబ్లీ సెక్రటేరియట్ విధులకు అనుకూలంగా వీటి నిర్మాణాలు ఉండాలని చెప్పానని అన్నారు.
స్పీకర్, లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కార్యాలయాల ఏర్పాట్లలో పలు సూచనలు చేశానని అన్నారు. అసెంబ్లీ సిబ్బందికి సంబంధించిన కార్యాలయాలు మొత్తం ఒకే ప్లేస్ లో ఉండేలా చూడాలని చెప్పానని, మొదటి, రెండు అంతస్తులలో అసెంబ్లీ, కౌన్సిల్ హాల్ ఉంటాయని అన్నారు. అసెంబ్లీ సిబ్బంది, మీడియాకు కావలసిన వసతులు, అసెంబ్లీకి సెక్యూరిటీ తదితర అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో అసెంబ్లీ, నార్మన్ ఫోస్టర్, సీఆర్డీఏ అధికారులు, వాస్తు నిపుణులు పాల్గొన్నారు.