Telangana: సంచలనం సృష్టించిన హత్య కేసులో స్వాతి రెడ్డికి బెయిలు.. ముఖం చాటేసిన తల్లిదండ్రులు!
- భర్త స్థానంలో ప్రియుడిని తెచ్చే కుట్ర
- బెయిలు వచ్చినా పూచీకత్తు లేక జైల్లోనే
- ఇంకా జైలులోనే స్వాతిరెడ్డి ప్రియుడు
భర్తను హత్య చేసి అతడి స్థానంలో ప్రియుడ్ని తెచ్చేందుకు ప్రయత్నించి పట్టుబడిన స్వాతి రెడ్డి 8 నెలల తర్వాత శుక్రవారం మహబూబ్‌నగర్ జైలు నుంచి బెయిలుపై విడుదలైంది. స్వాతి కేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. జైలు నుంచి బయటకొచ్చిన స్వాతిని తీసుకెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ రాకపోవడంతో పోలీసులు ఆమెను మహబూబ్‌నగర్‌లోని మహిళా సదనానికి తరలించారు. ఆమెపై ఇంకా ఆగ్రహజ్వాలలు చల్లారకపోవడంతో ఎవరైనా దాడిచేసే అవకాశం ఉందని భావించిన పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
నాగర్‌కర్నూలుకు చెందిన స్వాతిరెడ్డి తన ప్రియుడు రాజేశ్ కోసం భర్తను హత్య చేసింది. యాసిడ్ దాడి పేరుతో ప్రియుడి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి భర్త స్థానంలోకి అతడిని తీసుకురావాలని ప్రయత్నించింది. అయితే, ఈ మొత్తం వ్యవహారం వికటించి బండారం బయటపడింది. ప్రియుడి కోసం స్వాతి రెడ్డి వేసిన ప్లాన్ అందరినీ నివ్వెరపరిచింది. స్వాతి ఇంతటి ఘాతుకానికి పాల్పడిందని తెలియడంతో తల్లిదండ్రులే ఛీకొట్టారు. తండ్రి గుండు గీయించుకుని తమ కుమార్తె చనిపోయిందని ప్రకటించారు.
బెయిలు ఇప్పించేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో బయటి వ్యక్తులు కొందరు స్వాతికి బెయిలు ఇప్పించేందుకు ప్రయత్నించారు. అందుకు నిరాకరించిన ఆమె న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించింది. దీంతో ఈ నెల 16న ఆమెకు బెయిలు మంజూరైనా పూచీకత్తు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. బెయిలు వచ్చి పది రోజులు దాటడంతో జైలు నుంచి ఆమెను బయటకు పంపక తప్పలేదు. దీంతో పోలీసులు ఆమెను హైదరాబాద్‌లోని మహిళా సదనానికి తరలించాలని నిర్ణయించారు. కలెక్టర్ లేకపోవడంతో తాత్కాలికంగా ఆమెను మహబూబ్‌నగర్ మహిళా సదనానికి తరలించారు. స్వాతి ప్రియుడు రాజేశ్ ఇంకా జైలులోనే ఉన్నాడు.