High Court: టీఎస్ అసెంబ్లీ స్పీకర్ కు కూడా సమన్లు జారీ చేస్తాం: హైకోర్టు
- ఎమ్మెల్యేలను శాసనసభలోకి ఎందుకు అనుమతించడం లేదు?
- మా ఆదేశాలను పాటించాల్సిందే
- కోమటిరెడ్డి, సంపత్ ల బహిష్కరణపై హైకోర్టు సీరియస్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లపై అసెంబ్లీ బహిష్కరణ అంశం మలుపులు తిరుగుతోంది. వీరిద్దరిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, గన్ మెన్లను ఏర్పాటు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో, హైకోర్టు సీరియస్ గా స్పందించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన నేపథ్యంలో, అవసరమైతే అసెంబ్లీ స్పీకర్ కు కూడా సమన్లను జారీ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. తమ ఆదేశాలను పాటించాల్సిందేనంటూ మరోసారి స్పష్టం చేసింది.
ఎమ్మెల్యేలను శాసనసభలోకి ఎందుకు అనుమతించలేదని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)ను హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున వాదనలను వినిపిస్తున్న ఏజీ రామచంద్రరావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ప్రభుత్వం తరపున వాదిస్తున్నారా? లేక, రాజకీయ పార్టీ తరపున వాదిస్తున్నారా? అంటూ ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.