Pawan Kalyan: రాజధానిని గేటెడ్ కమ్యూనిటీలా తయారు చేస్తారేమో!: పవన్ కల్యాణ్
- రైతులతో దీక్షలు విరమింపజేసిన పవన్
- రైతుల డిమాండ్లు సహేతుకమైనవి
- భూములిచ్చిన రైతులు కొవ్వొత్తుల్లా కరిగిపోతున్నారు
జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాకా అందరూ కలిసి నివసించేలా రాజధాని అమరావతిని ప్రజారాజధానిలా నిర్మిస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఉద్దండరాయునిపాలెం గ్రామంలో అసైన్డ్ భూములకి పట్టా భూములతో సమానమైన ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరాహార దీక్ష చేపట్టిన రైతులకు ఆయన మద్దతుగా నిలిచారు. వారి పక్షాన పోరాడతానని హామీ ఇస్తూ వారితో దీక్ష విరమింపచేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే అమరావతిని 56 వేల ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలా తయారు చేస్తారేమో అనిపిస్తోందని, ఇది కేవలం ధనవంతులు మాత్రమే నివసించే నగరంలా చేస్తారేమోనని విమర్శించారు. రైతులు చేస్తున్న డిమాండ్లు సహేతుకమైనవని, రాజధాని కోసం చేసిన భూ సమీకరణ లోపభూయిష్టంగా ఉందని, బలవంతపు భూ సేకరణకు సిద్ధం అవుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ అంశాలపైనే విజయవాడలో పార్టీ తరఫున సదస్సు నిర్వహించామని, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు కొవ్వొత్తుల్లా కరిగిపోతున్నారని అన్నారు. వారికి తగిన పరిహారం, పెన్షన్ ఇస్తే కనీసం వారి జీవితానికి మిణుకుమనే వెలుగు అయినా వస్తుందని, వీరికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. పట్టా భూమితో సమానంగా అసైన్డ్ భూమికీ ప్యాకేజ్ ఇవ్వాలని, ఆ స్ధలాన్ని అమ్ముకొనే హక్కు కల్పించాలని, రైతులు, రైతు కూలీల కుటుంబాలకు నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని వారు చేస్తున్న డిమాండ్ సమంజసమేనని అన్నారు. అలాగే, వారికి నివాస స్థలం, ఉచిత గృహాల డిమాండ్లు నెరవేర్చాలని అన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఏ రైతూ, ఎవరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉండదని, ప్రజల అందరి సహకారంతో తమ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అందరూ కలిసి ఉండేలా ప్రజా రాజధానిని నిర్మించుకుందామని, ‘జనసేన’ ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో న్యాయం చేసే పార్టీ కాదని, అందరికీ సమానమైన న్యాయం జరిగేలా చేసే పార్టీ అని స్పష్టం చేశారు. 2003వ సంవత్సరం నుంచి జరుగుతున్న భూదోపిడి చూసి కడుపు మండి రాజకీయాల్లోకి వచ్చానని, ఒక చెట్టు మీద పక్షులు ఎలా ఆధారపడి ఉంటాయో, అలాగే, భూమిపై అనేక మంది ఆధారపడి బతుకుతారని.. రైతుల భూములు లాక్కుంటే ఎక్కడికి వెళ్లిపోతారు? అని ప్రశ్నించారు.
దళితులు కోరుకుంటున్నది ‘సమన్యాయం’ అని, అది కూడా ప్రభుత్వం చేయలేకపోతోందని, అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించనప్పుడు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేయడం ఎందుకు? అని ప్రశ్నించారు. అంబేద్కర్ ఆశయాలు, స్ఫూర్తిని తాము ముందుకు తీసుకువెళ్తామని పవన్ కల్యాణ్ చెప్పారు.