Maharashtra: మహారాష్ట్ర బస్సు ప్రమాదం: బయటపడిన ఒకే ఒక్కడు.. ప్రాణాలు ఎలా నిలుపుకున్నాడంటే..!
- లోయలో పడిన బస్సును అడ్డుకున్న చెట్లు
- వెంటనే దూకేసిన ప్రకాశ్
- పిక్నిక్ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన 33 మంది
మహారాష్ట్రలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. పిక్నిక్ కోసం బస్సులో మహాబలేశ్వరం వెళ్తుండగా అది ప్రమాదవశాత్తు 500 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 34 మందిలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రకాశ్ శర్వంత్ దేశాయ్ అనే వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఘాట్ రోడ్డుపై బురద కారణంగా, రాళ్లు బయటకు తేలి లూజుగా ఉండడంతో బస్సు స్కిడ్ అయిందని పేర్కొన్నాడు. బస్సు ఊగిసలాడి ఎడమ వైపు లోయలోకి పడిపోతోందని తనకు అర్థమైందన్నాడు. బస్సు లోయలో కొంతదూరం పడ్డాక చెట్లు అడ్డుకున్నాయని, దీంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా బస్సులోంచి దూకేశానని ప్రకాశ్ వివరించాడు.
అక్కడి నుంచి ఏదో రకంగా పైకెక్కానని పేర్కొన్నాడు. తాను పైకి చేరుకునే సరికే అక్కడ జనాలు పెద్ద సంఖ్యలో పోగై ఉన్నారని తెలిపాడు. అందులో ఓ వ్యక్తి తనకు ఫోన్ ఇస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్టు చెప్పాడు. నిజానికి ఈ ట్రిప్లో 40 మంది పాల్గొనాల్సి ఉండగా, వివిధ కారణాలతో కొందరు ఆగిపోయారు. దీంతో 34 మందితోనే బయలుదేరిన బస్సు పోలాడ్పూర్ సమీపంలోని అంబెనలి ఘాట్ వద్ద ప్రమాదానికి గురైంది.
బాధితులు అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన వారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికీ రూ.4 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.