Tamilnadu: తమిళనాట టెన్షన్ టెన్షన్... కరుణను పరామర్శించడానికి వస్తున్న వెంకయ్యనాయుడు!
- ప్రస్తుతం కావేరీ ఆసుపత్రిలో కరుణానిధి
- రాష్ట్రమంతటా బందోబస్తు పెంచిన పోలీసులు
- ప్రత్యేక పూజలు చేస్తున్న అభిమానులు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దేశరాజకీయాల్లో కురువృద్ధుడు కరుణానిధి ఆరోగ్యం విషమించడంతో, ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తుండగా, తమిళనాడు అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది. అన్ని పట్టణాల్లో అదనపు పోలీసు బలగాలు మకాం వేయడం, చెన్నైలో భారీ స్థాయిలో బందోబస్తు, కరుణానిధి ఇంటి పరిసరాలు, ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు... వీటన్నింటినీ చూస్తున్న డీఎంకే అభిమానులు, జరగరానిదేదో జరుగుతుందన్న ఆందోళనలో ఉన్నారు. తమ నేతకు ఏమీ కాకూడదని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
కాగా, కావేరీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించిన తాజా బులెటిన్ లో, కరుణానిధికి 8 మంది వైద్య నిపుణులు చికిత్సను అందిస్తున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియజేశారు. మరోవైపు నేడు కావేరీ ఆసుపత్రికి వెళ్లి కరుణానిధిని పరామర్శించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్ణయించారు. ఆసుపత్రిలో కరుణానిధి వద్దకు ఎవరినీ అనుమతించని పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో, స్టాలిన్, కనిమొళి తదితరులతో వెంకయ్య సమావేశమై, వివరాలు అడిగి తెలుసుకుంటారని తెలుస్తోంది.