TRAI: ఆధార్ నంబరును చెప్పి చాలెంజ్ చేసిన ట్రాయ్ చైర్మన్... వ్యక్తిగత డేటా మొత్తం చెప్పేసిన నెటిజన్లు!
- ఆధార్ సంఖ్యను ట్విట్టర్ లో పెడుతూ ఆర్ఎస్ శర్మ చాలెంజ్
- పాన్ నంబర్ నుంచి బ్యాంకు ఖాతాల వరకూ అన్నింటినీ చెప్పిన నెటిజన్లు
- ఇంకా ఎన్ని బయకు వస్తాయో చూస్తానన్న శర్మ
తన ఆధార్ నంబరును బహిర్గతం చేస్తూ, ఎవరికైనా చేతనైతే తన వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయాలంటూ ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) చైర్మన్ ఆర్ఎస్ శర్మ శనివారం నాడు విసిరిన సవాల్ కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. ఆ ఆధార్ సంఖ్యతో వెతుకులాట మొదలు పెట్టిన నెటిజన్లు, ఆధార్ ఏ మేరకు వ్యక్తిగత సమాచారాన్ని బట్టబయలు చేస్తుందో చెప్పేశారు. అతని పాన్ నంబర్, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, ఇంటి అడ్రస్, పుట్టిన తేదీ, తదితర వివరాలతో పాటు శర్మ ఫొటోలను కూడా బయటకు తీసి, ఆయన ట్విట్టర్ ఖాతాలో రిప్లయ్ ఇవ్వడం ప్రారంభించారు.
ఒక్క పాన్ కార్డు నంబర్ మినహా, మిగతా అన్ని ఆధార్ అనుసంధానిత వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నవేనని, పాన్ కార్డు వివరాలు బయటకు ఎలా వచ్చాయన్న విషయమై ఇంకా విచారించలేదని ట్రాయ్ అధికారి ఒకరు తెలిపారు. ఇక ఇదే విషయమై శర్మను ప్రశ్నించగా, ఇప్పటిప్పుడు తానేమీ స్పందించబోనని చెప్పిన ఆయన, ఈ చాలెంజ్ ని ఇంకొంతకాలం సాగనివ్వాలన్న యోచనలో ఉన్నట్టు తెలిపారు. తనకు సంబంధించిన ఇంకెన్ని వివరాలు బయటకు వస్తాయో తెలుసుకోవాలని ఉందని చెప్పారు.
"నేనిప్పుడు మీకో సవాల్ విసురుతున్నా. నా ఆధార్ నంబర్ ఇదే. ఎవరైనా ఈ నంబరుతో నాకు హాని తలపెట్టే అవకాశాలు ఉన్నాయని ఒక్క ఉదాహరణ చెప్పండి" అని శర్మ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించగా, వేల సంఖ్యలో రీ ట్వీట్లు వచ్చాయి.