Andhra Pradesh: జగన్ ‘కాపు రిజర్వేషన్’ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎవరెవరు ఏమన్నారంటే..
- ఇన్నాళ్లకు జగన్ బండారం బయటపడింది
- బీజేపీ సిద్ధాంతాలను జగన్ మోస్తున్నారు
- కాలర్ పట్టుకుని నిలదీయాలన్న టీడీపీ నేతలు
కాపు రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్పందించారు. జగన్ వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని పురపాలక శాఖా మంత్రి నారాయణ దుమ్మెత్తిపోశారు. కాపు రిజర్వేషన్‌పై జగన్ బండారం ఇన్నాళ్లకు బయటపడిందన్నారు. ఫిబ్రవరి 1, 2016లో జగన్ మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ అంశంపై తీర్మానం చేసి కేంద్రానికి పంపి షెడ్యూల్-9లో చేరిస్తే రిజర్వేషన్ సాధించవచ్చని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు యూటర్న్ తీసుకుని తనవల్ల కాదని చెప్పడం వెనక ఎవరున్నదీ అర్థం చేసుకోవచ్చన్నారు.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ కాపులకు అన్యాయం చేయాలన్న వైఖరి జగన్‌లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కాపులపై ద్వేషం వెళ్లగక్కుతున్న జగన్.. మోదీ డైరెక్షన్లోనే కాపు రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా మాట్లాడారని ఆరోపించారు. బీజేపీ సూచనలతో జగన్ ఆ వ్యాఖ్యలు చేశారన్నారు.
కాపులపై జగన్ వైఖరి ఏంటో తేటతెల్లమైందని టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ విమర్శించారు. జగన్‌తో అంటకాగిన ముద్రగడ ఇకనైనా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. తనకు మిత్రులెవరో, శత్రువులెవరో గుర్తించాలని హితవు పలికారు. రిజర్వేషన్లకు వ్యతిరేకమైన బీజేపీ సిద్ధాంతాలను జగన్ మోస్తున్నారని అన్నారు. ఈ విషయంలో కాపులు ఆయన కాలర్ పట్టుకుని నిలదీయాలన్నారు.