Tamilnadu: చెన్నైలో హై అలెర్ట్.. కరుణ ఇంటికెళ్లే దారులను మూసేసిన పోలీసులు!
- పోలీసుల సెలవులు రద్దు చేసిన ఉన్నతాధికారులు
- అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు
- కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్
డీఎంకే చీఫ్ కరుణానిధి ఆరోగ్యం విషమించిందన్న వార్తలతో చెన్నైలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలిసిన అభిమానులు వేలాదిగా కరుణ ఇంటికి చేరుకుంటున్నారు. భారీ సంఖ్యలో చేరుకుంటున్న కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో వారు తిరగబడడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.
ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రమంత్రా భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు చెన్నైలో హైఅలెర్ట్ ప్రకటించారు. పోలీసుల సెలవులను రద్దు చేసిన అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, గోపాలపురంలోని కరుణానిధి ఇంటికి వెళ్లే దారులను పోలీసులు మూసివేశారు. కరుణకు చికిత్స అందిస్తున్న కావేరీ అసుపత్రి వైద్యులు మరికాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు.
కార్యకర్తలు సంయమనం పాటించాలని, పోలీసులకు సహకరించాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, వదంతులను నమ్మొద్దని కనిమొళి కోరారు. మరికాసేపట్లో ముఖ్యమంత్రి పళనిస్వామి ఆసుపత్రికి చేరుకుని కరుణను పరామర్శించనున్నారు.