Pawan Kalyan: పవన్‌పై మండిపడిన సినీనటుడు శివాజీ.. అమరావతిని ఆపేస్తే ఎక్కడ కడతారో చెప్పాలని నిలదీత!
- ప్రత్యేక హోదా అంశాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు
- కేంద్రంపై పోరాడడం మాని బాబుపై విమర్శలా?
- 54 దేశాలు తిరిగిన మోదీ ఒక్క పరిశ్రమను కూడా తేలేకపోయారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ నటుడు శివాజీ మండిపడ్డారు. గుంటూరు కేజేఎస్ఎస్ ప్రాంగణంలో గుంటూరు మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు అధ్యక్షతన ‘మేధావుల మౌనం-సమాజానికి శాపం’ అనే సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆపేస్తానన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.అమరావతిని ఆపేస్తామంటున్న నేతలు దానిని ఎక్కడ నిర్మిస్తారో చెప్పాలని నిలదీశారు.
పవన్, జగన్‌లు ప్రత్యేక హోదా అంశాన్ని తమ రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై పోరాడడాన్ని మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేయడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ 54 దేశాలు తిరిగినా ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని, కానీ చంద్రబాబు రూ.లక్షల కోట్ల విలువైన పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చారని శివాజీ గుర్తు చేశారు.
కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనన్న శివాజీ అందరూ గట్టిగా నిలబడితే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందన్నారు. హోదా కోసం రైళ్లను ఆపేందుకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను అడ్డుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, చిత్త శుద్ధి ఉన్నవారు తనతో కలిసి రావాలని సవాలు విసిరారు. హోదా పోరు కీలక దశకు చేరుకుందని, యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ యువతకు సూచించారు.