karunanidhi: కరుణానిధికి వైద్యం అందిస్తున్న ఆయన రాజకీయ ప్రత్యర్థి .. మాజీ మంత్రి!
- కరుణకు వైద్యం అందిస్తున్న హెచ్‌వీ హండే
- ఎంజీఆర్ మంత్రివర్గంలో పదేళ్లు మంత్రిగా పనిచేసిన హండే
- ఎంజీఆర్‌కు, జయలలితకు వైద్య సేవలను కూడా పర్యవేక్షించింది ఆయనే
తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన డీఎంకే చీఫ్ కరుణానిధి ఆరోగ్యం మళ్లీ విషమించింది. ఆదివారం రాత్రి 8:30 గంటల సమయంలో కరుణ కుటుంబ సభ్యులందరూ ఆసుపత్రికి చేరుకోవడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాత్రి 9:50 గంటలకు కావేరీ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం కొంత విషమించినప్పటికీ ప్రస్తుతం బాగానే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు.
కాగా, కావేరీ ఆసుపత్రిలో కరుణకు చికిత్స చేస్తున్నది రాజకీయాల్లో ఆయన ప్రత్యర్థి కావడం విశేషం. గతంలో ఓసారి జరిగిన ఎన్నికల్లో కరుణానిధికి ప్రత్యర్థిగా తలపడి ఓడిపోయిన వైద్యుడే ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన పేరు హెచ్‌వీ హండే. ప్రస్తుతం కావేరీ ఆసుపత్రిలో 8 మంది వైద్యుల బృందం కరుణకు చికిత్స అందిస్తోంది. ఈ బృందంలో హెచ్‌వీ హండే కూడా ఉన్నారు. శనివారం నుంచి ఆయన కరుణానిధికి చికిత్స అందిస్తున్నారు.
హండే వైద్యుడు మాత్రమే కాదు, సీనియర్ రాజకీయ నేత, రచయిత కూడా. 1967, 1971లలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సుదంధిరా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత అన్నాడీఎంకే చేరారు. ఎంజీఆర్ మంత్రివర్గంలో పదేళ్లు ఆరోగ్యశాఖా మంత్రిగా ఉన్నారు. 1980లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అన్నానగర్ నియోజకవర్గం నుంచి కరుణానిధికి ప్రత్యర్థిగా పోటీ చేశారు. అయితే, ఈ ఎన్నికల్లో ఆయన 699 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పట్లో కరుణానిధికి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత 2006లో బీజేపీలో చేరి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 9వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.
1984లో హండే చెన్నైలోని షెనై నగర్‌లో ఆసుపత్రిని ప్రారంభించారు. ఎంజీఆర్‌కు మూత్ర పిండాల సమస్య వచ్చినప్పుడు దగ్గరుండి వైద్య సేవలను పర్యవేక్షించారు. ఆయన కోసం అమెరికా నుంచి వైద్యులను రప్పించారు. జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా వైద్య సేవలను పర్యవేక్షించారు.