Madhya Pradesh: నెలకు రూ. 50 వేలు పాకెట్ మనీ తీసుకునే వ్యాపారి కుమార్తె... బయట చేసే పనులు చూసి అవాక్కైన పోలీసులు!
- భోపాల్ ఏటీఎంల మోసం కేసులో ముఠా అరెస్ట్
- ముఠాలో ఎంబీయే చదువుతున్న యువతి
- డ్రగ్స్ కు అలవాటై చెడు దారిలో
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరుగుతున్న ఏటీఎం మోసాల కేసులో ఓ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితురాలిగా ఉన్న ఓ యువతి బ్యాక్ గ్రౌండ్ చూసి అవాక్కయ్యారు. ఇక్కడి గుల్మొహర్ కాలనీలో స్కిమ్మర్ లు, కెమెరాలు అమర్చి డెబిట్ కార్డులను క్లోనింగ్ చేసి, 73 మంది ఖాతాదారుల నుంచి రూ. 17 లక్షలకు పైగా ఈ ముఠా దోపిడీ చేసింది.
ఈ కేసులో ముంబైలోని ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకోగా, అందులో ఓ యువతి కూడా ఉంది. ఆమె తండ్రి బడా బిల్డర్. తన కుమార్తెకు నెలకు రూ. 50 వేలు పాకెట్ మనీ ఇస్తుంటాడు. ముంబైలో ఎంబీఏ చదివిస్తున్నాడు. అంత ఘనమైన నేపథ్యం ఉన్నప్పటికీ చెడు అలవాట్లకు బానిసైంది. మత్తుకు అలవాటు పడింది. డ్రగ్స్ కోసం ఈ ముఠాలో చేరింది. గత రెండేళ్లుగా ఏటీఎం కార్డుల డేటాను తస్కరించేందుకు సహకరిస్తోంది. ఈ కేసులో ముంబైకి చెందిన మొహమ్మద్ హుస్సేన్ హాకమ్, ఫైజన్ ఖాన్ తదితరులను అరెస్ట్ చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.