Power bill: రూ.317ల కోసం రూ.16 వేలు పోగొట్టుకున్న మహిళ!
- పొరపాటున గత నెల బిల్లు కట్టిన మహిళ
- డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా విద్యుత్ సంస్థకు ఫిర్యాదు
- ఫోన్ చేసి రూ.16 వేలు నొక్కేసిన మోసగాడు
కరెంటు బిల్లు కడుతూ పొరపాటున గత నెల బిల్లు చెల్లించిన ఓ మహిళ వాటిని వెనక్కి తీసుకునే క్రమంలో ఏకంగా రూ.16 వేలు కోల్పోయింది. అసలు విషయం తెలిశాక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది.
బెంగళూరుకు చెందిన 40 ఏళ్ల విదితా చౌదరి మొబైల్ యాప్ ‘పేయూ మనీ’ ద్వారా కరెంటు బిల్లు చెల్లించింది. అయితే, ఈ నెల బిల్లుకు బదులు అంతకుముందు నెల బిల్లు అయిన రూ.317ను కట్టేసింది. తర్వాత నాలుక్కరుచుకున్న ఆమె ఆ డబ్బులను వెనక్కి తీసుకునేందుకు బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (బెస్కామ్)కు ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు చేసిన నాలుగు రోజుల తర్వాత విదితకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను బెస్కామ్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. చెల్లింపులో పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని పేర్కొన్న అతడు.. కొన్ని వివరాలు చెబితే నిమిషాల్లోనే డబ్బులు వెనక్కి వచ్చేస్తాయని చెప్పాడు. ఇందుకోసం ఆమె డబ్బులు చెల్లించిన ఐసీఐసీఐ డెబిట్ కార్డు వివరాలు కావాలని చెప్పాడు. దీంతో ఆమె వెనకాముందు ఆలోచించకుండా వివరాలన్నీ చెప్పేసింది. అంతే, ఆమె ఖాతా నుంచి రూ.16 వేలు మాయమయ్యాయి. దీంతో జరిగిన మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.