Brazil: ఘోర ప్రమాదంలో నిండు చూలాలి మృతి... సహాయక చర్యలకు వెళ్లిన అధికారులకు కనిపించిన శిశువు!
- ప్రసవం కోసం వెళుతుంటే ప్రమాదం
- కడుపు పగిలి బయటకు వచ్చిన చిన్నారి
- చిన్నారిని కాపాడి ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు
ప్రసవం కోసం ఓ ట్రక్కు ఎక్కి వెళుతున్న మహిళ, వాహన ప్రమాదంలో మృతి చెందగా, సహాయక చర్యలకు వెళ్లిన పోలీసులకు అప్పుడే పుట్టిన శిశువు కనిపించింది. ఎవరూ ఊహించనటువంటి ఈ ఘటన బ్రెజిల్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, నిండు చూలాలు కాన్పు కోసం వెదురు బొంగుల లోడుతో వెళుతున్న ట్రక్కులో ప్రయాణిస్తోంది. సావోపాలో నుంచి క్యూరిటీబా మధ్య వాహనం వెళుతుండగా, వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్, ఆ గర్బిణీ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో గర్భిణి పొట్ట పగిలిపోయి శిశువు బయటకు వచ్చింది. ఈ విషయం తెలియని పోలీసులు, వాహనాన్ని తొలగించి గర్భిణి మృతదేహాన్ని బయటకు తీస్తుండగా, పక్కనే కొద్ది దూరంలో గడ్డిలో అప్పుడే పుట్టిన శిశువు ఏడుపు వినిపించింది. ఆ చిన్నారిని సురక్షితంగా ఆసుపత్రికి చేర్చిన అధికారులు, మృతి చెందిన గర్భిణీ బంధువుల కోసం ఆరా తీస్తున్నారు.