raghuveera reddy: కాంగ్రెస్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వాస్తవం!: ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి

  • కాంగ్రెస్ పై ప్రజల్లో కోపం తగ్గుతోందన్న చంద్రబాబు వ్యాఖ్యలు నిజం
  • హామీలు నెరవేర్చని బీజేపీ ఒక లిటిగెంట్ పార్టీ
  • కిరణ్ ఏడాది క్రితమే వచ్చుంటే బాగుండేది 

రాష్ట్ర విభజనను ప్రస్తుతం ఎవరూ వ్యతిరేకించడం లేదని... విభజన హామీలు నెరవేరలేదనే అందరూ బాధపడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఏపీ ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ బీజేపీయేతర పార్టీలన్నీ కోరుతున్నాయని తెలిపారు. హామీలను నెరవేర్చకుండా ఏపీని బీజేపీ వంచించిందని...  అదొక లిటిగెంట్ పార్టీ అని విమర్శించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.

కాంగ్రెస్ పై ఏపీ ప్రజలకు కోపం తగ్గుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా... ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు నిజమని రఘువీరా అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పై ద్వేష భావం ఉండేదని... ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే విభజన హామీలు నెరవేరుతాయని చెప్పారు. ఏపీ అంశాన్ని ఈరోజు జాతీయ అజెండాగా చేశామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏడాది క్రితమే కాంగ్రెస్ లోకి వచ్చి ఉంటే చాలా బాగుండేదని రఘువీరా అభిప్రాయపడ్డారు. ఏడాది క్రితమే రాహుల్ గాంధీని ఆయన కలిశారని... కిరణ్ చేరిక గురించి రాహుల్ తనతో ప్రస్తావిస్తే... మేమంతా సరేనన్నామని తెలిపారు. కిరణ్ రాకతో పార్టీ మరింత బలోపేతమయిందని... అందరితో కలసి ఆయన పని చేస్తారని చెప్పారు. 

  • Loading...

More Telugu News