Jammu And Kashmir: బీజేపీతో చేతులు కలపడమంటే ఓ కప్పు విషం తీసుకోవడమే!: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ
- బీజేపీపై నిప్పులు చెరిగిన ముఫ్తీ
- ఆ పార్టీతో పొత్తువల్ల బాధను భరించా
- వాజ్ పేయీ హయాంలో సత్సంబంధాలుండేవి
జమ్మూకశ్మీర్ లో ఇటీవల పీడీపీకి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా బీజేపీపై మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ లో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, బీజేపీతో చేతులు కలపడమంటే ఓ కప్పు విషం తీసుకోవడమేనని విమర్శించారు.
ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న కారణంగా రెండు సంవత్సరాల రెండు నెలలు ఆ బాధను తాను భరించానని అన్నారు. వాజ్ పేయీ హయాంలో బీజేపీతో తమకు మంచి సంబంధాలు ఉన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. కాగా, పీడీపీకి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నప్పటి నుంచి ఆ పార్టీపై ఆమె నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. మూడు రోజుల క్రితం పీడీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలోనూ బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీడీపీని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ నేతలను ఆమె హెచ్చరించారు.