Shirdi: గురుపూర్ణిమ రోజున ఆదాయంలో తిరుమలను దాటేసిన షిర్డీ!
- రికార్డు స్థాయిలో సాయినాథుని ఆదాయం
- గురు పూర్ణిమకి ముందు రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 6.26 కోట్లు
- గురు పూర్ణిమ రోజున సాయినాథునికి వచ్చిన ఆదాయం రూ.6.40 కోట్లు
గురు పూర్ణిమ రోజున షిర్డీలో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది. తిరుమల శ్రీవారి కంటే ఎక్కువ ఆదాయంతో రికార్డులకెక్కింది. గురు పూర్ణిమకు ఒక రోజు ముందు శ్రీవారికి వచ్చిన హుండీ ఆదాయం రూ.6.26 కోట్లు కాగా, అంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారని టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇక, గురు పూర్ణిమ ఉత్సవాల సందర్భంగా షిర్డీ సాయినాథునికి వచ్చిన హుండీ ఆదాయం రూ.6.40 కోట్లు. అంటే శ్రీవారి ఆదాయం కంటే ఎక్కువన్న మాట. సాయినాథునికి వచ్చిన హుండీ ఆదాయంలో రూ.13.83 లక్షల విలువైన స్వర్ణాభరణాలు, రూ.11.25 లక్షల విలువైన విదేశీ కరెన్సీ కూడా ఉన్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.
ఆదాయంలో ఎప్పుడూ ముందుండే శ్రీవారికి ఈసారి తగ్గడం వెనక చంద్రగ్రహణం కారణమని చెబుతున్నారు. గురుపూర్ణిమ రోజున ఉదయం పది గంటలకే శ్రీవారి ఆలయాన్ని మూసేశారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ తర్వాత సర్వ దర్శనానికి అనుమతి ఇచ్చారు. అంటే, దాదాపు ఒక రోజంతా స్వామి వారిని దర్శించుకునే అవకాశం భక్తులకు లేకుండా పోయింది. ఈ కారణంగానే స్వామి వారికి వచ్చే ఆదాయం తగ్గినట్టు చెబుతున్నారు.