Andhra Pradesh: అర్చకులకు వరాలు ప్రకటించేందుకు సిద్ధమైన చంద్రబాబు సర్కారు
- కీలకమైన 76పై సానుకూల నిర్ణయం
- అర్చకుల వేతనం రూ.10 వేలకు పెంపు
- రాజధానిలో రెండంతస్తుల అర్చక-బ్రాహ్మణ భవనం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్చకులకు శుభవార్త చెప్పేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. వేతనం, వారసత్వ హక్కులకు సంబంధించి జీవో 76పై సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం 1400 మంది అర్చకులకు ఇస్తున్న రూ.5 వేల వేతనాన్ని ఇకపై రూ.10 వేలకు పెంచడంతోపాటు దానిని ఐదువేల మందికి వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. వారసత్వ హక్కులకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అర్చకుల పిల్లలు వారసత్వాన్ని అందిపుచ్చుకుని అర్చకత్వం కొనసాగించేలా రూపొందించిన జీవో 76కు సంబంధించి తుది ప్రకటన జారీ చేసేందుకు ఓ కమిటీ వేయాలని సర్కారు నిర్ణయించింది.
సుదూర ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చే అర్చకులు, బ్రాహ్మణులకు ఇబ్బంది లేకుండా అమరావతిలో బ్రాహ్మణ-అర్చక భవానాన్ని రెండంతస్తులలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్చకుల వేతనాన్ని ఆలయంలో తొలి పద్దుగా నిర్వహించడంతోపాటు వేతనాన్ని బ్యాంకులో జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం సచివాలయంలోని సీఎం కార్యాలయంలో అర్చకుల సమస్యలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.