Jayalalitha: జయలలిత మృతి కేసులో సంచలన విషయం వెల్లడి.. ఆసుపత్రిలో టీవీ చూస్తున్న జయ వీడియో నకిలీదని తేలిన వైనం!
- జయ జ్యూస్ తాగుతున్న వీడియో శశికళ మాయాజాలం
- జయ గదిలో టీవీ అమర్చే అవకాశమే లేదని తేల్చిన కమిషన్
- మృతి విషయంలో బలపడుతున్న అనుమానాలు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. జయ మృతిపై నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ ఎదుట హాజరవుతున్న వారు విస్తుపోయే నిజాలను వెల్లడిస్తుండగా తాజాగా బయటపడిన విషయం అందరినీ నివ్వెర పరుస్తోంది.
జయలలిత చికిత్స పొందిన అపోలో ఆసుపత్రిని కమిషన్ కార్యదర్శి కోమల ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా జయ చికిత్స పొందిన ఐసీయూలోకి వెళ్లిన ఆమె ఆ గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రత్యేక గదిలో జయ చికిత్స పొందుతున్నప్పుడు శశికళ ఓ వీడియోను చిత్రీకరించి విడుదల చేశారు. అందులో జయ టీవీ చూస్తూ జ్యూస్ తాగుతున్నట్టుగా ఉంది.
అయితే, ఈ వీడియో నకిలీదని కోమల గుర్తించారు. జయ పడుకున్న మంచానికి ఎదురుగా ద్వారం మాత్రమే ఉండడంతో ఆమె అనుమానం మరింత బలపడింది. జయ చికిత్స పొందుతున్న మంచానికి ఎదురుగా ఉన్న గోడకు టీవీ అమర్చే అవకాశమే లేదని ఆమె గుర్తించారు. దీంతో ఆ వీడియో నకిలీదని తేలిందని కోమల తెలిపారు. పలు కోణాల్లో నిర్వహించిన దర్యాప్తులోనూ అది నకిలీదని తేలిందని ఆమె వివరించారు.