Narendra Modi: కాబోయే ప్రధాని ఇమ్రాన్‌కు ఫోన్ చేసి అభినందించిన మోదీ
- పాక్‌లో ప్రజాస్వామ్యం బలపడుతుందని మోదీ ఆకాంక్ష
- ఆగస్టు 11న ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం
- గెలిచిన వెంటనే మోదీపై ఇమ్రాన్ విమర్శలు
పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు భారత ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందించారు. ఇమ్రాన్ గెలుపుతో పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం బలపడుతుందని ఆకాంక్షించారు. పాక్ ఎన్నికల్లో పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాలేదు. దీంతో స్వతంత్రులు, చిన్న పార్టీలతో కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇమ్రాన్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వచ్చే నెల 11న ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు ఇమ్రాన్ తెలిపారు.
కాగా, ఎన్నికల్లో ఇమ్రాన్ విజయం సాధించిన వెంటనే మీడియాతో మాట్లాడుతూ మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను నవాజ్ షరీఫ్‌ను కానని పేర్కొంటూనే భారత్‌తో సత్సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తానని ప్రకటించారు. భారత్ ఒకడుగు ముందుకేస్తే తాను రెండడుగులు వేస్తానన్నారు. కాగా, డిసెంబరు 11, 2015న భారత పర్యటనకు వచ్చిన ఇమ్రాన్ మోదీని కలిశారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగాలని ఆకాంక్షించారు.