Mahabharat: తవ్వకాల్లో బయటపడిన మహాభారత కాలం నాటి అవశేషాలు
- తవ్వకాల్లో రథం బయటపడడం ఇదే తొలిసారి
- నాలుగు వేల ఏళ్లనాటి రాగి పిడి కలిగిన కత్తి
- సమాధుల్లో ఆహార పదార్థాలు, దువ్వెనలు, అద్దాలు
ఉత్తరప్రదేశ్లోని సనైలీ గ్రామంలో పురాతత్వ శాస్త్రవేత్తలు జూన్లో జరిపిన తవ్వకాల్లో మహాభారత కాలం నాటి అవశేషాలు బయటపడ్డాయి. రథాలు, కత్తులు, సమాధులు, శవపేటికలు, అస్థికలు తదితర వాటిని బయటకు తీశారు. క్రీస్తుపూర్వం 2000-1800 సంవత్సరాల (మహాభారత) కాలం నాటివిగా గుర్తించారు. తవ్వకాల్లో బయటపడిన వస్తువులను జాగ్రత్తగా ఎర్రకోటకు తరలించిన అధికారులు వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. పురావస్తు తవ్వకాల్లో రథం బయటపడడం ఇదే తొలిసారని పురాతత్వ అధికారులు చెబుతున్నారు. నాలుగు వేల ఏళ్లనాటి రాగి పిడి కలిగిన కత్తులను కూడా కనుగొన్నారు.
తవ్వకాల్లో బయటపడిన 8 సమాధుల్లో కొన్ని ఆహార పదార్థాలు, దువ్వెనలు, అద్దాలు, బంగారు పూసలు ఉన్నట్టు తెలిపారు. సమాధుల్లో లభించిన ఎముకలు, దంతాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపిన శాస్త్రవేత్తలు కత్తులు, ఇతర పరికరాలను మెటలర్జికల్ పరీక్షలకు పంపుతున్నట్టు తెలిపారు.