fertilisers: సగం భారత్ విషాన్ని తాగుతోంది.. పార్లమెంటుకు తెలిపిన కేంద్రం!
- తెలంగాణలో భూగర్భ జలాలు విషపూరితం
- 386 జిల్లాల్లో కలుషితమైన నీరు
- చర్మ, బ్లాడర్ కేన్సర్ వస్తాయంటున్న వైద్యులు
రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలు, పురుగు మందుల కారణంగా దేశంలోని భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితం అయ్యాయని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. దేశంలోని సగం జిల్లాల్లో నీటిలో నైట్రేట్స్, లెడ్, ఆర్సెనిక్, ఫ్లోరైడ్, కాడ్మియం, ఇతర భార లోహాలు ఉన్నాయని వెల్లడించింది.
కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని 386 జిల్లాల్లో (ప్రస్తుతం దేశంలో 720 జిల్లాలు ఉన్నాయి) ని భూగర్భ జలాల్లో హానికారక రసాయనాలు సాధారణం కంటే 50 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఇక ఢిల్లీలోని 11 జిల్లాల్లో ఏడింటిలో ఫ్లోరైడ్ కాలుష్యం తీవ్రంగా ఉంది. అలాగే దేశంలోని 335 జిల్లాల్లో ఫోర్లైడ్, 153 జిల్లాల్లో ఆర్సెనిక్, 24 జిల్లాల్లో కాడ్మియం వంటి రసాయనాలున్న నీటిని తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.
ఈ విషపూరితమైన నీటిని వాడితే చర్మం, పిత్తాశయం, కిడ్నీ, ఊపిరితిత్తులకు కేన్సర్ సోకే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే దీనివల్ల కాళ్లు, పాదాలలోని రక్తనాళాలు దెబ్బతినడం వల్ల వచ్చే ఇబ్బందులు, మధుమేహం, హైబీపీ, సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతాయన్నారు. అంతేకాకుండా ఈ కలుషిత నీటిని తాగితే.. శరీరంలో ఆక్సిజన్ ప్రసరణ స్థాయి తగ్గిపోయే మెథిమోగ్లోబినేమియా సమస్య కూడా తలెత్తవచ్చని వైద్యులు చెప్పారు.
కాగా, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని భూగర్భ జలాల్లో అన్నిరకాలైన విషపూరిత రసాయనాలు, భార లోహాలు ఉన్నాయని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది.