Jagan: కాపు రిజర్వేషన్లపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు: వైఎస్ జగన్
- యూటర్న్ తీసుకునే అలవాటు మా ఇంటావంటా లేదు
- కాపు రిజర్వేషన్లకు మా మద్దతు
- కాపులను చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారు
జగ్గంపేట బహిరంగసభలో కాపు రిజర్వేషన్లపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కాపులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేని చంద్రబాబు మోసగాడా? కాపులకు మద్దతుగా నిలబడ్డ జగన్ మోసగాడా? అని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపు రిజర్వేషన్లకు తమ పార్టీ మద్దతు ఇస్తోందని, ఈ విషయంలో సలహాలిస్తే స్వీకరిస్తానని అన్నారు. యూటర్న్ తీసుకునే అలవాటు తమ ఇంటావంటా లేదని, ఎల్లో మీడియా మద్దతు ఉందని బాబు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రతి కులాన్ని, మతాన్ని చంద్రబాబు మోసం చేశారని, ఇలా మోసం చేసే వాళ్లను, అబద్ధాలను చెప్పే వాళ్ల మాటలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వలేమని తెలిసినా టీడీపీ మ్యానిఫెస్టోలో కాపు రిజర్వేషన్ల అంశం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు, నాలుగున్నరేళ్లుగా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
‘నేను చేయగలిగేదే నా నోట్లోంచి హామీగా వస్తుంది. వైఎస్ జగన్ మోసం చేయడు, చేయలేనిది చేస్తానని చెప్పడు. నిజం చెప్పేవాడు, న్యాయంగా ఉండేవాడినే ప్రజలు దీవిస్తారు’ అని జగన్ అన్నారు.