Jagan: కాపులకు భయపడే జగన్ వెనక్కి తగ్గారు: చినరాజప్ప విమర్శలు
- జగన్ వ్యాఖ్యలను మేము వక్రీకరించలేదు
- జగన్ సీఎం అయ్యేదెప్పుడు?
- కాపు కార్పొరేషన్ కు పదివేల కోట్లు ఇచ్చేదెప్పుడు?
కాపు రిజర్వేషన్లపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని జగన్ పేర్కొనడంపై ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ అన్న మాటలనే తాము చెప్పాం తప్ప, ఆయన వ్యాఖ్యలను తామేమీ వక్రీకరించలేదని అన్నారు. కాపులకు భయపడే జగన్ వెనక్కి తగ్గారని, ఇప్పటికైనా కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా ఆయన స్పందించడం సంతోషకరమని అన్నారు.
ఈ సందర్భంగా జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ ఎప్పటికీ సీఎం కాలేరని, పులివెందుల ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలవలేరని జోస్యం చెప్పారు. జగన్ సీఎం అయ్యేదెప్పుడు? కాపు కార్పొరేషన్ కు పదివేల కోట్లు ఇచ్చేదెప్పుడు? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాపు రిజర్వేషన్ల చట్టాన్ని షెడ్యూల్ 9లో పెట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని, కాపు రిజర్వేషన్లు చంద్రబాబుతోనే సాధ్యమని ముద్రగడ కూడా చెప్పారని అన్నారు. బీసీలు, కాపులకు మధ్య తగువు పెట్టడానికి జగన్ యత్నిస్తున్నారని ఆరోపించారు.