Tamilnadu: కరుణానిధి చిరకాల కోరికను నెరవేర్చిన అన్నా డీఎంకే ప్రభుత్వం!
- బ్రాహ్మణేతర వ్యక్తిని అర్చకుడిగా నియమించిన ప్రభుత్వం
- పేరు బయటపెట్టకుండా జాగ్రత్తలు
- కరుణకు తెలిస్తే ఎంత సంతోషిస్తారో
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషమ పరిస్థితి నుంచి కోలుకుంటున్నట్టు వార్తలు వస్తున్న తరుణంలో ఆయన చిరకాల వాంఛ ఒకటి నెరవేరింది. మధురై ఆలయంలో బ్రాహ్మణేతర పూజారిని నియమించాలన్న ఆయన కలను ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చింది. తమిళనాడు చరిత్రలోనే తొలి బ్రాహ్మణేతర వ్యక్తిని ఆలయ పూజారిగా నియమిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
2006లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ఆలయాల్లో బ్రాహ్మణేతరులను కూడా నియమించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం నోటిఫికేషన్ జారీ చేశారు. కులంతో సంబంధం లేకుండా అర్చకత్వంలో శిక్షణ పొందిన వారిని ఆలయాల్లో నియమిస్తామని అందులో పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారిపోయాయి. పన్నెండేళ్లు గడిచిపోయాయి.
తాజాగా మధురైలోని తల్లాకుళంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని అయ్యప్ప ఆలయానికి బ్రాహ్మణేతర వ్యక్తిని పూజారిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, బ్రాహ్మణేతర వ్యక్తి పూజారిగా ఉంటే ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్న కారణంతో ఆ పూజారి పేరును ప్రభుత్వం బయటపెట్టకుండా జాగ్రత్త పడింది. మూడు నెలల క్రితమే అతడిని నియమించినట్టు తోటి అర్చకులు తెలిపారు. ఆగమశాస్త్ర నియమ నిబంధనల ప్రకారమే అతడిని నియమించినట్టు హెచ్ఆర్ అండ్ సీఈ సీనియర్ అధికారి సైతం ధ్రువీకరించారు. మొత్తానికి కరుణానిధి కోరికను అన్నా డీఎంకే ప్రభుత్వం ఇలా నెరవేర్చిందన్నమాట.