Kerala: కేరళ చర్చిలో రేప్ కేసులో ప్రలోభాల పర్వం.. కేసు వెనక్కి తీసుకుంటే పదెకరాల స్థలం!
- కేరళ చర్చిలో మహిళపై నలుగురు ఫాదర్ల అత్యాచారం
- బాధితురాలికి అండగా క్రైస్తవ సన్యాసిని
- ఫోన్ చేసి బేరసారాలు సాగించిన బిషప్
- కేసును ఉపసంహరించుకోవాలంటూ హెచ్చరిక
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ సెక్స్ కుంభకోణంలో బాధితురాలికి ప్రలోభాలు, ఆమెకు అండగా నిలబడిన క్రైస్తవ సన్యాసినికి వేధింపులు మొదలయ్యాయి. కేసును ఉపసంహరించుకుంటే బాధితురాలికి పదెకరాల స్థలం ఇస్తామని, ఆమెకు అండగా నిలబడిన సన్యాసినికి చర్చిలో ఉద్యోగం ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. తమను ఎదిరించి నిలబడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. వీరి మధ్య జరిగిన సంభాషణ ఆడియో బయటకు రావడంతో వైరల్ అయింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దాలని చూసిన చర్చి పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది.
2014-16 మధ్య మలంకరా కేథలిక్ సిరియన్ చర్చి ఫాదర్ ఫ్రాంకో ములక్కల్ ఓ మహిళను తన కార్యాలయానికి పిలిపించుకుని అతడితో సహా నలుగురు ఫాదర్లు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం వెలుగులోకి వచ్చి కేరళలో సంచలనమైంది. అత్యాచారానికి పాల్పడి చర్చి ప్రతిష్ఠను దెబ్బతీసిన ఫాదర్ ఫ్రాంకో తరపున వకాల్తా పుచ్చుకున్న ఫాదర్ జేమ్స్ ఇప్పుడు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు.
బాధితురాలికి అండగా ఉన్న క్రైస్తవ సన్యాసిని సిస్టర్ అనుపమకు ఫోన్ చేసిన బిషప్ ఫాదర్ జేమ్స్ బేరం పెట్టాడు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని, బాధితురాలికి అండగా నిలబడడం మానుకోవాలని హెచ్చరించారు. కేసును వెనక్కి తీసుకుంటే పదెకరాల స్థలం ఇస్తామని ఆశ చూపారు. తమ మాట వింటే మీకే మంచిదని హెచ్చరించారు. అంతేకాదు, తమను ఎవరూ ఏమీ చేయలేరని తేల్చి చెప్పారు. ఇప్పటికే చర్చి పేరు మంటగలిసిన నేపథ్యంలో బిషప్ బేరసారాలు వెలుగులోకి రావడంతో స్పందించిన చర్చి జేమ్స్‌ను ఉద్యోగంలోంచి తొలగించింది. కాగా, అత్యాచార ఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.