Imran Khan: నరేంద్ర మోదీనే కాదు.. ఎవర్నీ పిలవలేదు!: ఇమ్రాన్ ఖాన్ పార్టీ వివరణ
- 11న ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం
- ఏ దేశాధినేతనూ ఆహ్వానించలేదన్న పీటీఐ
- విదేశాంగ శాఖ సలహా ప్రకారం నిర్ణయమన్న ఫవాద్ చౌదరి
పాకిస్థాన్ లో ఈ నెల 11న తెహ్రీక్ - ఇ - ఇన్సాఫ్ (పీటీఐ) నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో, ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఆ పార్టీ నేతలు కొట్టి పారేశారు. భారత్ సహా, ఏ దేశ ప్రధానినీ ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించ లేదని స్పష్టం చేశారు. అసలు ఎవరినైనా ఆహ్వానించాలా? వద్దా? అన్న విషయమై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించినట్టు వార్తా సంస్థలు వెల్లడించాయి.
కాగా, పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికారులను సంప్రదించిన తరువాత విదేశీ దేశాధినేతలను ఆహ్వానించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్ చౌదరి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కాగా, ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే సార్క్ దేశాధినేతలను తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారని, ఆ జాబితాలో మోదీ కూడా ఉన్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.