assam: వాళ్లతో మాకు సంబంధం లేదు: స్పష్టం చేసిన బంగ్లాదేశ్

  • అసోం సమస్య వందేళ్ల నుంచి ఉంది
  • గత 48 ఏళ్లలో భారత ప్రభుత్వం ఈ సమస్యను లేవనెత్తలేదు
  • బంగ్లా మాట్లాడే ప్రతి వ్యక్తి బంగ్లాదేశీ అని అనడం కరెక్ట్ కాదు

అసోంలో చేపట్టిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం పార్లమెంటును కూడా కుదిపేస్తోంది. అసోంలో ఉంటున్న 40 లక్షల మంది పౌర రిజిస్టర్ లో నమోదు కాకపోవడంతో... వీరి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ అంశంపై బంగ్లాదేశ్ సమాచార ప్రసార శాఖ మంత్రి హసానుల్ హక్ స్పందించారు. అక్రమంగా నివసిస్తున్న వారిని బంగ్లాదేశీయులుగా పేర్కొనడం సరైంది కాదని ఆయన అన్నారు.

బంగ్లాదేశ్ నుంచి ఏఎన్ఐకి హనానుల్ టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. అసోం సమస్య అనేది వందేళ్ల సమస్య అని... ఈ విషయం అందరికీ తెలిసిందే అని ఆయన చెప్పారు. గత 48 ఏళ్ల కాలంలో ఏ భారతీయ ప్రభుత్వం కూడా ఈ సమస్యను లేవనెత్తలేదని... అక్రమ చొరబాట్లను బాంగ్లాదేశ్ తో ముడిపెట్టలేదని ఆయన గుర్తు చేశారు. అక్రమ చొరబాట్లకు, బాంగ్లాదేశ్ కు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వమే ఈ సున్నితమైన సమస్యను పరిష్కరించాలని చెప్పారు. న్యాయపరంగా ఈ సమస్యను పరిష్కరించవచ్చని సూచించారు.

భారత్ లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీలను మళ్లీ మీ దేశంలోకి ఆహ్వానిస్తారా? అనే ప్రశ్నకు బదులుగా... భారత ప్రభుత్వం ఇంత వరకు తమతో ఎన్ఆర్సీ వివరాలను పంచుకోలేదని, ఈ సమస్యను ఎన్నడూ లేవనెత్తలేదని చెప్పారు. ఈ దిశగా భారత్ ప్రభుత్వం అడుగు వేసేంత వరకు తాము ఏమీ మాట్లాడలేమని తెలిపారు. బంగ్లా మాట్లాడే ప్రతి వ్యక్తిని బంగ్లాదేశ్ జాతీయుడిగా చెప్పడం సరైంది కాదని అన్నారు.

మరోవైపు ఈ అంశంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసమే బీజేపీ ఈ దారుణానికి ఒడిగడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలతో రక్తపాతాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News